: అసెంబ్లీలో ప్రశ్నిస్తామనే కుట్రలు: ధర్నాలో రోజా
తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో రోజా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రానున్న అసెంబ్లీలో తన పార్టీ సభ్యులు ప్రశ్నించడానికి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆమె అన్నారు. అసెంబ్లీలో తాము అడిగే ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రతి అసెంబ్లీ సెషన్ ముందు ఏదో ఒక గొడవ పెట్టుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు చేస్తోన్న అన్యాయాలను అసెంబ్లీలో తాము ప్రశ్నిస్తామన్న భయంతోనే వారు తమపై కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
తమ నేతలకి పిచ్చెక్కిందని ప్రభుత్వ నేతలు అంటున్నారని, ఎవరికి పిచ్చెక్కిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తున్నారని రోజుకోలా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. తాము తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కుంటామని అన్నారు. నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఇలాగే కొనసాగితే వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుందని అన్నారు. హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టానని, సింధు మెడల్ తేవడానికి తానే కారణమని చంద్రబాబు అంటారని ఆమె అన్నారు. తనను కూడా మహిళా సదస్సుకు వెళ్లేటప్పుడు అడ్డుకున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్‌ని దుర్వినియోగం చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజల ప్రాణాలు తీయడానికే ప్రైవేటు బస్సులకు అనుమతులిస్తున్నారని వ్యాఖ్యానించారు.