: చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్నారు.. మన సత్తా ఈ విధంగా చూపించాం: అమరావతిలో స‌్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మాట్లాడుతూ... ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికామని అన్నారు. ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కల సాకారం అవడానికి సాయపడుతున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని అన్నారు. రాష్ట్రం విడిపోయాక ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఏపీలో వేగవంతంగా సచివాలయం, శాసనసభ వంటి ఎన్నో భవనాలను నిర్మించామని అన్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డేనని చెప్పుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, శాసన సభ్యులు, గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారని కోడెల అన్నారు. మన శాసనసభ, మన చట్టాలు అన్నీ మన ప్రాంతంలోనే ఇంత తక్కువ సమయంలో నిర్మించుకున్నామని చెప్పారు. ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అన్నారు.. సత్తా చూపించాలి అన్నారు. మన సత్తా ఈ విధంగా చూపించాం’ అని స‌్పీకర్ కోడెల అన్నారు.