: జగన్ కారణంగా ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లు జైలుకెళ్లారు!: మంత్రి కామినేని
బస్సు ప్రమాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలోని నందిగామ ప్రభుత్వాసుపత్రిలో నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మరోసారి మండిపడ్డారు. నిజాయతీ పరుడైన కలెక్టరుని పట్టుకొని ఇలా మాట్లాడతారా? అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఐఏఎస్‌ని జైలుకి పంపిస్తాడా? అని అడిగారు. జగన్ కారణంగా ఇప్పటికే శ్రీలక్ష్మి వంటి ఎంతో మంది ఐఏఎస్ అధికారులు జైలుకెళ్లారని ఆయన అన్నారు.
రాజకీయాలు చేసుకోండి కానీ, శవాలదగ్గర వద్దని కామినేని హితవు పలికారు. ఎమ్మెల్యే రోజాతో పాటు వైసీపీ నేతలు ఎంతో మంది తమపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. తన నిజాయతిపై రోజా నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో జగన్ కావాలనే గొడవ చేశారని ఆయన ఆరోపించారు. బస్సు ప్రమాద బాధితులకి ఇవ్వాల్సిన పరిహారం తప్పకుండా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. బస్సు ప్రమాదానికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.