: తిరుమల పోలీసుల అత్యుత్సాహం... నకిలీ నోట్లున్నాయంటూ ఢిల్లీ దంపతులకు నరకం!
తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవాలని ఢిల్లీ నుంచి వ్యయ, ప్రయాసలతో వచ్చిన ఆ వృద్ధ దంపతులకు తిరుమల పోలీసులు తమ అత్యుత్సాహంతో నరకం చూపించారు. వారి వద్ద నకిలీ నోట్లున్నాయని ఆరోపిస్తూ, గంటల కొద్దీ విచారణ పేరిట నిర్బంధించారు. తాము షుగర్ వ్యాధి గ్రస్తులమని చెప్పినా వినలేదు. తమ తీర్థయాత్రలో భాగంగా ఢిల్లీకి చెందిన ప్రదీప్ (65), ఆయన భార్య తిరుమలకు వచ్చారు.
లేపాక్షి నుంచి తాము బస చేసిన ఎంబీసీ - 14కు జీపులో వెళ్లి, దాని డ్రైవర్ కు రూ. 100 ఇచ్చారు. అక్కడే గొడవ మొదలైంది. తన కిచ్చిన నోటు నకిలీదంటూ ఆ డ్రైవర్ గొడవ ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదీప్, ఆయన భార్యను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న రూ. 12 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని ప్రశ్నలతో విసిగించారు. అవి ఒరిజినల్ నోట్లేనని చెబుతున్నా వినిపించుకోలేదు. చివరికి వాటిని ఓ బ్యాంకుకు పంపి, అవి మంచి నోట్లేనని తేలడంతో ఆ నగదును వారికి అప్పగించి పంపారు. పోలీసుల తీరును పలువురు విమర్శించారు.