: జగన్ పరామర్శించకుండానే మృతదేహాలను తరలిస్తున్నారని వైసీపీ ఆందోళన!
కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి బౌతిక కాయాలను నందిగామ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రోడ్డు ప్రమాద స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి ఆసుపత్రికి చేరుకున్నారు.
అయితే, అప్పటికే మృతదేహాలను ఆసుపత్రి నుంచి సిబ్బంది తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నేతలు సిబ్బందిని అడ్డుకుని జగన్ పరామర్శించకుండానే మృతదేహాలని తరలిస్తున్నారని ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద హైడ్రామా నడిచింది. వైసీపీ నేత పార్థ సారధి మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు అందించాలని, గాయాలయిన వారికి రూ.10 లక్షలు అందించాలని అన్నారు. అక్కడకు చేరుకున్న జగన్ ప్రస్తుతం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. కలెక్టర్ ను అడిగి సహాయక చర్యలపై వివరాలు తెలుసుకుంటున్నారు.