: దివాకర్ ట్రావెల్స్ పై సెక్షన్ 337, 338 కింద కేసు నమోదు
గత రాత్రి ప్రమాదానికి గురై 11 మంది ప్రాణాలను బలిగొన్న వోల్వో బస్సు యాజమాన్యం 'దివాకర్ ట్రావెల్స్'పై కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ సెక్షన్ 337, 338, 304ఏ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, నిబంధనల అతిక్రమణ వంటి అభియోగాలను మోపారు. మితిమీరిన వేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసు వర్గాలు తెలిపాయి. రెండున్నర అడుగుల ఎత్తయిన రెయిలింగ్ ను ఢీకొట్టి, దానిపై నుంచి బస్సు కాలువలోకి పడిపోయిందంటే, ఆ బస్సు గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తూ ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. బస్సు ఢీకొన్నా రెయిలింగ్ పూర్తిగా దెబ్బతినలేదని, రెయిలింగ్ బలంగానే ఉందని తెలిపారు. బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాఫ్తు కొనసాగుతుందని ఏపీ డీజీపీ సాంబశివరావు మీడియాకు తెలిపారు.