: భారతీయులారా భయమొద్దు.. అమెరికా రండి: ‘రియల్ హీరో’ గ్రిల్లోట్
అమెరికాలోని కాన్సస్‌లో తెలుగువాడైన శ్రీనివాస్ కూచిభొట్లపై జరిగిన కాల్పుల తర్వాత బిక్కుబిక్కుమంటున్న భారతీయులకు ‘రియల్ హీరో’ గ్రిల్లోట్ అభయహస్తం ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారతీయుల్లో గూడుకట్టుకున్న భయాందోళనలను పారదోలే ప్రయత్నం చేశాడు. గత బుధవారం ఓ బార్‌లో నేవీ మాజీ ఉద్యోగి ఒకరు శ్రీనివాస్, అతడి స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతి చెందాడు. కాల్పులు జరుపుతున్న సమయంలో వారిని రక్షించడానికి ఎదురెళ్లిన అమెరికన్ గ్రిల్లోట్‌కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. తూటాలకు ఎదురెళ్లిన గ్రిల్లోట్ ‘రియల్ హీరో’గా మారిపోయాడు.
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రిల్లోట్‌ను ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు జంపాల చౌదరి, సతీష్ వేమన తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రిల్లోట్ మాట్లాడుతూ కాన్సస్ ఘటనతో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘‘ఉపాధి, ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన భారతీయులు భయపడవద్దు. ప్రస్తుత ఘటనలు తాత్కాలికమే. ఎవరు ఎక్కడైనా ఉపాధి పొందే అవకాశం ఉంది. అమెరికా రావడం మానుకోవద్దు’’ అని పేర్కొన్నాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా శ్రీనివాస్‌ను కాపాడాలనుకున్నానని, ఏదో ఒకటి చేయాలని అనిపించే వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశానని ఆనాటి ఘటనను గ్రిల్లోట్ గుర్తు చేసుకున్నాడు.