: జగన్ ఎత్తు చిత్తు.. దగ్గరవుతున్న శిల్పా, భూమా!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏం చేసినా కలిసి రావడం లేదు. టీడీపీని ఎలాగైనా ఇరుకున పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. శిల్పా, భూమా వర్గాల మధ్య అగాధం పెంచేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు వారిని మరింత దగ్గర చేస్తున్నాయి. స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డిని ఈ జిల్లా నుంచి బరిలోకి దించాలని జగన్ నిర్ణయించారు. అదే సమయంలో టీడీపీకి వైసీపీ నాయకత్వం లోపాయికారీగా ఓ ప్రతిపాదన పంపింది. వెంకటరెడ్డి బావమరిది శివానందరెడ్డికి టికెట్ ఇస్తే వెంకటరెడ్డిని బరి నుంచి తప్పించి, పోటీని ఏకగ్రీవం చేస్తామనేది ఆ ప్రతిపాదన సారాంశం. శివానందరెడ్డి కనుక ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు అందించారు.
తద్వారా శిల్పా చక్రపాణిరెడ్డికి టికెట్ రాకుండా చేయాలని వైసీపీ ప్లాన్‌గా చెబుతున్నారు. ఆయనకు టికెట్ రాకుండా చేస్తే శిల్పా సోదరులు చంద్రబాబుపై అలిగి పార్టీని వీడుతారని, తద్వారా కర్నూలో టీడీపీ భారీగా నష్టపోతుందని వైసీపీ నేతలు అంచనా వేశారు. వైసీపీ ప్రతిపాదనలోని మర్మాన్ని గ్రహించిన చంద్రబాబు.. చక్రపాణిరెడ్డినే పోటీలో నిలుపుతున్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి శిల్పా పోటీని కన్ఫర్మ్ చేశారు. వెంటనే కర్నూలు వెళ్లి అందరినీ కలిసి విషయాన్ని వివరించాలని, సమన్వయం చేయాలని ఆదేశించారు. ఆయన వెంటనే కర్నూలు చేరుకుని భూమా, శిల్పా వర్గీయులను పిలిపించి మాట్లాడారు. వైసీపీ ప్లాన్ వివరించారు. ఆ తర్వాత శిల్పా సోదరులు, భూమా నాగిరెడ్డి, ఆయన బావమరిది ఎస్వీ మోహనరెడ్డి, కుమార్తె అఖిలప్రియ తదితరులంతా కలిసి అచ్చెన్నాయుడు సమక్షంలో కూర్చుని మాట్లాడుకున్నారు. అనంతరం ఇదే సమావేశానికి శివానందరెడ్డిని కూడా పిలిపించి మాట్లాడడంతో అపోహలు పటాపంచలయ్యాయి. అలా వైసీపీ ప్లాన్‌కు చంద్రబాబు చెక్ పెట్టారు.