: ఫోన్ చేసి 'ఎస్' అనే మాట రాబడుతున్నారు.. ఆపై కేసు వేసి డబ్బంతా లాగేస్తున్నారు!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద ఫోన్ స్కాం యూజర్లను కష్టాలపాలు చేస్తోంది. కేటుగాళ్లు ఏదో ఓ నెంబరుకి ఫోన్ చేస్తున్నారు.. అర్థం కాని విధంగా ఏదో చెప్పేస్తున్నారు. చివరికి నేను మాట్లాడేది మీకు వినిపిస్తోందా? అని అడుగుతున్నారు. దానికి యూజర్లు ‘ఎస్’ బాగానే వినపడుతోంది అని చెబుతుండడంతో అదే అదునుగా ఆ ఎస్ అనే మాటని రికార్డు చేసి డబ్బు లాగేస్తున్నారు. మనం చెప్పే ఎస్ అనే ఆ ఒక్క మాటను జాగ్రత్తగా రికార్డు చేసి పెట్టుకుని, కావల్సిన చోట కట్ పేస్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారు. అనంతరం ఆ రికార్డింగ్ ఆధారంగా మన దగ్గర నుంచి భారీగా డబ్బు నొక్కేయడానికి ప్లాన్లు అమలు చేస్తున్నారు.
ఇటువంటి ఘటనలే ఇటీవల అమెరికా, బ్రిటన్ దేశాల్లో అధికంగా కనిపించాయి. కేటుగాళ్లు తమ వస్తువులు లేదా సర్వీసులను మనకు ఇచ్చినట్లుగా వాయిస్ రికార్డు చేస్తున్నారు. అవి మనకు అందినట్లు, దానికి గాను డబ్బు చెల్లించడానికి మన అంగీకారం కోరినట్లుగా మన వాయిస్‌ను రికార్డు చేస్తున్నారు. మనం చెప్పిన 'ఎస్' అనే సమాధానాన్ని ఇక్కడ వాడుకుంటూ, ఒకవేళ మనం ఆ తర్వాత మనకు ఆ వస్తువులు గానీ, సేవలు గానీ అందలేదని చెప్పినా, డబ్బు చెల్లించబోమని చెప్పినా వాళ్లు రికార్డు చేసి పెట్టుకున్న ఎస్ అనే మాటను ఆధారంగా ఆడియో క్లిప్ తో మన మీద కేసులు వేసి డబ్బు లాగేస్తున్నారు.
ఎన్నో కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఫోన్లోనే వాయిస్ సిగ్నేచర్లు తీసుకుంటున్నాయి. దీంతో ఇటువంటి వాటితో ఇప్పుడు వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని 'ఎస్' అనే సమాధానాన్ని రాబట్టేందుకు వారు చేస్తోన్న ప్రయత్నాలని తిప్పికొట్టాలని ఆ పదం చెప్పకూడదని నిపుణులు సూచిస్తున్నారు.