: ఒక్క లేఖతో ఆస్కార్ ఆడిటోరియాన్ని కదిలించిన డైరెక్టర్ ఫర్హది
ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఇరాన్ డైరెక్టర్ ఫర్హదీ, ఈ కార్యక్రమాన్ని తానెందుకు బహిష్కరించినదీ ఓ లేఖ ద్వారా తెలియజేశారు. ఫర్హదీ తరఫున ఆస్కార్ అవార్డును అందుకున్న ఓ యువతి, ఆయన రాసిన లేఖను ఆస్కార్ వేదికపై చదువుతుంటే, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. ఆయన రాసిన లేఖలో "అకాడమీ సభ్యులకు, ఇరాన్ లోని నా చిత్ర టీమ్ కు కృతజ్ఞతలు. నాతో పాటు ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో నామినేట్ అయిన ఇతర చిత్రాలకు అభినందనలు. ఈ రాత్రి నేను మీతో లేకపోయినందుకు క్షంతవ్యుడను.
నా దేశ ప్రజలతో పాటు మరో ఆరు దేశాల గౌరవాన్ని కించపరుస్తూ, అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను. (ఈ సమయంలో ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది) ప్రపంచాన్ని విభజించాలన్న ఆలోచనే భయం కలిగిస్తోంది. ఇది యుద్ధానికి దారి తీయవచ్చు. ప్రజాస్వామ్యానికి విఘాతంగా, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ, దేశాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోంది. దేశాల మధ్య చిచ్చు పెడుతున్న ఇటువంటి నిర్ణయాలు వస్తున్న వేళ, ప్రజలు మరింత దృఢంగా నిలవాల్సిన అవసరముంది" అని తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఫర్హదీ లేఖను పంపారు.