: మలుపుతిప్పిన శోభాడే ట్వీట్.. 180 కేజీల దౌలత్ ఇక స్లిమ్ అయిపోతారు!
ప్రముఖ రచయిత్రి శోభా డే ‘భారీ బందోబస్తు’ ట్వీట్ మధ్యప్రదేశ్‌కు చెందిన 180 కేజీల ఇన్‌స్పెక్టర్ దౌలత్‌రామ్ జోగావత్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమె ట్వీట్‌తో దౌలత్‌రామ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోయింది.
ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బందోబస్తు కోసం వచ్చిన ఆయనను చూసిన శోభాడే.. దౌలత్‌రామ్ ఫొటోతో ‘ముంబైలో భారీ బందోబస్తు’ పేరుతో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలిసిన దౌలత్‌రామ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తాను తినడం వల్ల లావవడం లేదని, గాల్‌బ్లాడర్‌కు శస్త్రచికిత్స జరిగిన తర్వాత హార్మోన్లలో తలెత్తిన అసమతౌల్యత వల్ల ఇలా బరువుపెరిగానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దౌలత్‌రామ్ గురించి మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో విషయం ముంబై వైద్యుల దృష్టికి వెళ్లింది. ఆయనకు చికిత్స అందించేందుకు సెంటర్ ఫర్ ఒబెసిటీ సర్జరీ చేసేందుకు ముందుకొచ్చింది. దౌలత్‌ను ముంబైకి తీసుకొచ్చిన ఆ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డిసౌజా మాట్లాడుతూ పరీక్షల అనంతరం అతడికి మందులు ఇవ్వాలా, లేక శస్త్రచికిత్స చేయాలా.. అన్న విషయాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. దీనిపై దౌలత్‌రామ్ స్పందిస్తూ శోభాడే వ్యంగ్య ట్వీట్ తన జీవితాన్ని మార్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి తనకు మెరుగైన జీవితం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.