: ఉద్యమంలో పాలు పంచుకున్న వారి గురించే అడగండి.. పవన్ గురించి అడగవద్దు: ముద్రగడ
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్‌ల కోసం పోరాటం చేస్తోన్న మాజీ మంత్రి, కాపు ఐక్య వేదిక నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు కర్నూలులో మీడియాతో మాట్లాడారు. తాను ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై ఎన్నో హామీలు గుప్పించిందని, ఇప్పుడు ఆ విషయమే మరచిపోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు ఉద్యమానికి మద్దతు తెలపడం లేదా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... పవన్ తమకు మద్దతు ఇస్తున్నారో లేదో ఆయననే అడగాలని, తనను అడగడం సరికాదని అన్నారు.
ఉద్యమంలో పాలు పంచుకున్న వారి గురించే అడగాలని, వారి గురించి చెబుతానే తప్ప తమ ఉద్యమంలో పాలుపంచుకోని వారి గురించి అడిగితే తాను చెప్పబోనని ముద్రగడ అన్నారు. మొదటి నుంచి ఉద్యమంలో పలువురు పాలు పంచుకుంటున్నారని అన్నారు. ఉద్యమంలో పాలు పంచుకోని వారిని తాను ఇబ్బంది పెట్టబోనని అన్నారు. తనకు మరే ఏ ఇతర ఆశలు, ఆకాంక్షలు లేవని, కాపులకు న్యాయం జరిగేవరకు పోరాడతానని చెప్పారు.