: మేఘాలయలో చర్చికి వెళ్తుండగా ట్రక్కు బోల్తా... 16 మంది మృతి.. 50 మందికి గాయాలు
సుమారు 70 మంది ప్రయాణికులతో వెళుతోన్న ఓ ట్రక్కు బోల్తా పడడంతో 16 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన ఘోర ప్రమాద ఘటన మేఘాలయలోని వెస్ట్ ఖాసి హిల్స్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్కులోని ప్రయాణికులు ఓ చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న సహాయబృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. ఈ ఘటనలో గాయాలపాలయిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.