: హైదరాబాద్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ క్యాంపస్ ప్రాంగణంలో ఈ రోజు పలు ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని గెట్ మై జాబ్ డాట్ కామ్ పేరుతో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అందుకోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా సుమారు 5000 మంది యువత నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.200 ఫీజు వసూలు చేశారు. అయితే, తీరా అక్కడికి వచ్చి చూస్తే ఇంటర్వ్యూ నిర్వాహకులు చెప్పినట్లుగా ఉద్యోగ మేళాలో కంపెనీలు పాల్గొనలేదు. ఉద్యోగమేళా పేరుతో తమను మోసం చేశారని నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ ఫీజు తమకు తిరిగి ఇవ్వాలని కాలేజీ ఫర్నిచర్ ధ్వంసం చేశారు.
రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగ మేళాకు హాజరైన వేలాది మంది నిరుద్యోగులు ఆ కాలేజీ ముందు రాస్తారోకోకు దిగారు. ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేశారని, ఉద్యోగ మేళా నిర్వాహకుల తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు అన్నీ నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.