: టీమిండియాను చిత్తు చేసిన సహచరులకు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సీరియస్ వార్నింగ్!
ఇండియాను సొంత గడ్డపై 333 పరుగుల తేడాతో ఓడించిన ఆస్ట్రేలియా జట్టు, ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. తొలి మ్యాచ్ లో పరాభవం తరువాత, ఆ జట్టు తిరిగి గాడిలో పడటానికి తీవ్రంగా కృషి చేస్తుందని, ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని జట్టు సహచరులకు ఆయన హితబోధ చేశాడు. తదుపరి మూడు మ్యాచ్ లూ అత్యంత క్లిష్టమైనవని, భారత జట్టు ఆటగాళ్ల నాణ్యతపై తనకు ఎంతమాత్రమూ సందేహం లేదని, వారు సాధ్యమైనంత త్వరగా తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారని, ఇదే సమయంలో సిరీస్ లో మరిన్ని విజయాలు సాధించేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కృషి చేయాలని సూచించాడు. ఇండియా ఆటగాళ్లను నిలువరించేందుకు తమకున్న అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటామని తెలిపాడు.