: ట్రంప్ నిర్ణయాలపై కన్నేసిన బులియన్ మార్కెట్... తేడా వస్తే, రూ. 40 వేలకు బంగారం ధర!


ప్రపంచ బులియన్ మార్కెట్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న ఆర్థిక విధానాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బ్రెగ్జిట్, బలహీనమైన యూరో, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు తదితరాలు పెట్టుబడికి అనువైన రంగంగా బులియన్ మార్కెట్ ను సూచిస్తున్న వేళ, ఇప్పటికే బంగారం ధరలు నాలుగు నెలల గరిష్ఠానికి చేరుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాటి మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర అక్టోబర్ 18, 2016 నాటి స్థాయిని దాటి రూ. 30,325కు చేరుకుంది. వెండి ధరలు సైతం అదే దారిలో పయనిస్తూ కిలోకు రూ. 43,800 దాటింది.

ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు వారాల వ్యవధిలో ఔన్సు బంగారం ధర 3 శాతం పెరిగి 1,257 డాలర్లకు చేరింది. ఈ వారంలో ట్రంప్ తన నూతన ఆర్థిక విధానాన్ని ప్రకటించనుండటంతో, బులియన్ మార్కెట్ వర్గాలు అమెరికా వైపు చూస్తున్నాయి. బంగారం తదుపరి పయనాన్ని ట్రంప్ విధానాలు ప్రభావితం చేయవచ్చని కామ్ ట్రెండ్జ్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ అభిప్రాయపడ్డారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ విడుదల చేసిన సంకేతాలు సైతం బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలను సూచిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు.

కాగా, సాధారణంగా క్రూడాయిల్ ధరలు, బంగారం ధరలు అనులోమాను పాతంలో సాగుతుంటాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉంటే, బంగారం ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి. పలు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిపై ఆంక్షలను అమలు చేస్తుండటంతో, క్రూడాయిల్ మార్కెట్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రూడాయిల్ ధర ఎంచుకునే వేరియంట్ ను బట్టి బ్యారల్ కు 54 నుంచి 56 డాలర్ల మధ్య కొనసాగుతోంది. బ్యారల్ ముడిచమురు ఆల్ టైం హై 135 డాలర్లు కాగా, ఆ స్థాయికి మరోసారి ధరలు చేరితే, బంగారం ధర కూడా రికార్డు స్థాయికి చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. ముడి చమురు ధర 100 డాలర్లను తాకితే, 10 గ్రాముల బంగారం ధర రూ. 38 వేల నుంచి రూ. 40 వేలకు చేరవచ్చని అంచనా.

  • Loading...

More Telugu News