: కోహ్లీ సేనకు మిలియన్ డాలర్లు దక్కేనా?!
టెస్టుల్లో టాప్ పొజిషన్ లో ఉన్న జట్టుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇచ్చే మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6.7కోట్లు) నగదు ప్రోత్సాహం ఎవరికి లభిస్తుందన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ సంవత్సరంలో చాలా కాలం పాటు ఇండియా టెస్టుల్లో టాప్ పొజిషన్ లో ఉంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా భారత ర్యాంకుపై సందేహాలు లేవు. కానీ, తొలి టెస్టులో భారీ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా, ఇకపై జరిగే మూడు టెస్టు మ్యాచ్ లలో కనీసం ఒకటైనా గెలిస్తేనే, పారితోషికం తుది గడువు ఏప్రిల్ 1 నాటికి తొలి స్థానంలో ఉంటుంది. లేకుంటే మిలియన్ డాలర్లను కోల్పోయినట్టేనని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు. ఇక ఆసీస్ జట్టు భారత్ ను క్లీన్ స్వీప్ చేయగలిగితే, ఆ జట్టు తొలి స్థానానికి వెళ్లి ప్రైజ్ మనీని ఎగరేసుకుపోతుంది.