: భారత్ ను ఆక్రమించుకోవాలని ఇస్లామిక్ స్టేట్ కుట్ర పన్నుతోంది: ఉగ్రవాదుల నుంచి క్షేమంగా బయటపడిన రామ్మూర్తి
భారతదేశాన్ని ఆక్రమించాలని ఐఎస్ఐఎస్ ఎంతో ఆసక్తిగా ఉందని మొన్నటి వరకు ఆ సంస్థ వద్ద బందీగా ఉండి, క్షేమంగా బయటపడిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసి డాక్టర్ కొసనం రామ్మూర్తి చెప్పారు. ఈ రోజు భారత్‌కు చేరుకున్న ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.... భారతదేశ విద్యావ్యవస్థ, ఆర్థికవృద్ధి చూసి ఉగ్రవాదులు ఆకర్షితులయ్యారని చెప్పారు. అందుకే ఐఎస్ఐఎస్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు వాళ్ల సంభాషణల ద్వారా తాను గుర్తించానని తెలిపారు.
ఉగ్రవాదులు తనను శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టారని రామ్మూర్తి చెప్పారు. తనకు దారుణమైన వీడియోలు చూపించేవారని, ఐఎస్ఐఎస్ కార్యకలాపాలను తనకు అర్థం అయ్యేలా చేశారని పేర్కొన్నారు. తనతో పాటు ఎంతో మంది బందీలను హింసించేవారని చెప్పారు. వారి నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నదే వారి లక్ష్యమని చెప్పారు. తనను ఉగ్రవాద సంస్థ కోసం పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేశారని ఆయన చెప్పారు. తనకు అంత అనుభవం లేదని చెప్పినా వినిపించుకోలేదని చెప్పారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు సుమారు ఏడాదిన్నర క్రితం ఆసుపత్రిలోకి ప్రవేశించి రామ్మూర్తిని, ఒడిషాకు చెందిన ఇంజనీర్ సామల్ ప్రవాష్ రంజన్‌ను, ఏడుగురు ఫిలిప్పీన్స్ నర్సులను ఎత్తుకెళ్లారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆయనను విడిపించింది.