: ప్రపంచంలో ఇదే మొదటిసారి.. సీట్లు లేవని విమానంలో ప్రయాణికులను నిలబెట్టి తీసుకెళ్లిన వైనం!
బస్సుల్లో, రైళ్లలో సీటు దొరకకపోతే ఏం చేస్తాం? వాటిల్లో నిలబడే ప్రయాణం చేస్తాం. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి ప్రయాణికుడికి ఎదురయ్యే సాధారణ అనుభవమే ఇది. అయితే, ఎవరి ఊహకూ అందని విధంగా విమానంలోనూ అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికులను నిలబెట్టి తీసుకెళ్లడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. పాకిస్థానీ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సంస్థ సౌదీ అరేబియాకు వెళ్లే విమానంలో ఏడుగురు ప్రయాణికులను అలా విమానంలో సీటు లేకుండా నిలబెట్టి ప్రయాణించేలా చేసింది.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ కరాచీ నుంచి మదీనా వెళ్లే విమానంలో మొత్తం సీట్లన్నీ నిండిపోయాయని, తర్వాత కూడా ఆ విమానంలోకి ఏడుగురిని ఎక్కించి తీసుకెళ్లిన మాట వాస్తవమేనని చెప్పారు. చేత్తో రాసిన బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సదరు ప్రయాణికులను విమానం ఎక్కించారు. ఇలా తీసుకెళ్లడం ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. ఎమర్జెన్సీగా కావల్సి వస్తే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు తగినంతగా ఉండవని అన్నారు. ఈ విషయం గురించి సదరు విమాన ఫైలట్ స్పందిస్తూ.. తాను టేకాఫ్ తీసుకున్న తర్వాత చూస్తే కొంతమంది అదనంగా కనిపించారని అన్నాడు. తనకు ఈ విషయం గురించి ఎవ్వరూ చెప్పలేదని చెప్పాడు.