: అమెరికాలో ట్రంప్... భారత్ లో మోదీ, కేసీఆర్ ఒకటే!: సీపీఐ నారాయణ
అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెచ్చగొట్టేలా ఎలా మాట్లాడుతున్నారో మన దేశంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ నాయకుల మాటలు చాలా ప్రభావం చూపుతాయని.. ట్రంప్ మాటల వల్ల అమెరికాలో మన వాళ్లు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ మతాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆయన తన వ్యాఖ్యలతో మొత్తం రాజకీయ వాతావరణాన్నే కలుషితం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.
రాజకీయ నాయకుల మాటలు సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయని నారాయణ అన్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మాటల వల్ల అక్కడ మన వాళ్లు కష్టాలు ఎదుర్కుంటున్నారని అన్నారు. అమెరికాలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడితో మోదీ మాట్లాడాలని సూచించారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని ఆయన అన్నారు.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజాసొమ్ముని ఖర్చుచేసి తిరుపతి వేంకటేశ్వరునికి రూ.5 కోట్లతో నగలు చేయించారని ఆయన విమర్శించారు. కేసీఆర్ సొంత డబ్బు ఏమయినా ఉంటే కనుక దానితో దేవుడికి నగలు చేయించుకోవచ్చని ఆయన అన్నారు. సొంతంగా మీసాలు లేని కేసీఆర్.. మరో దేవుడికి మీసాలు చేయిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.