: ఒకీఫ్ ధాటికి చేతులెత్తేసిన టీమిండియా టాపార్డర్.. పీకల్లోతు కష్టాల్లో భారత్!
టీమిండియాకు ఘోరపరాభవం తప్పేలా కనిపించడం లేదు. ఎన్నో అంచనాలతో మొదలైన టూర్ తో ఆస్ట్రేలియా జట్టు అద్భుత ప్రదర్శన చేయగా, టీమిండియా పేలవమైన ప్రదర్శనతో అప్రదిష్ట మూటగట్టుకునే దిశగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ అనుభవాలతో మన టాపార్డర్ బ్యాట్స్ మేన్ క్రీజును అంటిపెట్టుకుని ఉంటారని భావించిన అభిమానులను భారత ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఐదో ఓవర్ లో మురళీ విజయ్ (2) ను ఒకీఫ్ పెవిలియన్ కు పంపి శుభారంభం ఇచ్చాడు. అనంతరం అదే రకమైన బంతితో కేఎల్ రాహుల్ (10) ను లియాన్ బోల్తా కొట్టించాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ (13)ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఒకీఫ్ 17వ ఓవర్ లో బౌల్డ్ చేశాడు.
ఆ తరువాత రహానే కొట్టిన బంతిని లియాన్ అద్భుతంగా అందుకుని అవుట్ చేశాడు. అనంతరం మరోసారి మెరిసిన ఒకీఫ్, రవి చంద్రన్ అశ్విన్ (8)ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ పై ఆడిన తొలి టెస్టులోనే 10 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. దీంతో ఛటేశ్వర్ పుజారా (27)కు జతగా సాహా దిగాడు. దీంతో కేవలం 25 ఓవర్లలో 89 పరుగులకు భారత జట్టు 5 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో ఒకీఫ్ నాలుగు వికెట్లతో రాణించగా, లియాన్ ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. భారత్ ఆటతీరుతో నేడే మ్యాచ్ ముగిసిపోయే పరిస్థితి కనబడుతోంది.