: గెట్ అవుట్... శ్వేత జాతీయులపై కన్నెర్ర చేస్తున్న సౌదీ అరేబియా!


అమెరికా మిత్ర దేశం సౌదీ అరేబియా కూడా... అదే బాటలో నడుస్తోంది. రెండు దేశాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. వలసవాదులంతా తమతమ దేశాలకు వెళ్లిపోవాలని, అమెరికాలోని ఉద్యోగాలన్నీ అమెరికన్లవే అని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గర్జిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సౌదీ అరేబియా కూడా అదే ఫాలో అవుతోంది. కాకపోతే, అందరినీ తమ దేశం నుంచి వెళ్లిపోమనట్లేదు. తమ దేశంలో తిష్ల వేసి, అధిక వేతనాతలతో పనిచేస్తున్న తెల్ల జాతీయులపై మాత్రం కన్నెర్రజేస్తోంది. అపారమైన చమురు విక్రయాలతో సంపన్న దేశంగా భాసిల్లిన సౌదీ అరేబియా... గత కొంత కాలంగా చమురు ధరల పతనంతో, ఆర్థికంగా దెబ్బతింది. ఇప్పుడు చమురు ధరలు కాస్త పెరిగినా, ఆ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కోలుకోలేదు.

ఈ నేపథ్యంలో, అధిక వేతనాలు తీసుకుంటున్న విదేశీయులపై ఆ దేశ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కువ జీతాలు పొందుతున్న వారంతా శ్వేత జాతీయులే కావడంతో... వారిని సొంత దేశాలకు సాగనంపాలని నిర్ణయం తీసుకుంది. సౌదీలో దాదాపు 90 లక్షల మంది విదేశీయులు పని చేస్తున్నారు. ఈ సందర్భంలో, జర్మనీకి తిరుగుపయనమైన ఓ శ్వేత జాతీయుడు మాట్లాడుతూ, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే తెల్లవారిని పంపించేందుకు సౌదీ ప్రభుత్వం సిద్ధ పడిందని తెలిపారు. ఈ నిర్ణయం సౌదీ అరేబియాకు చాలా మేలు చేస్తుందని చెప్పారు. మరోవైపు విదేశీ ఉద్యోగులను అధికంగా కలిగి ఉన్న కంపెనీలపై కూడా పన్నులు విధించే యోచనలో సౌదీ ప్రభుత్వం ఉంది. భారత్, పాకిస్థాన్ లాంటి ఆసియా దేశాల నుంచి వెళ్లిన వారిలో అత్యధిక శాతం మంది లేబర్ గానే అక్కడ పని చేస్తున్నారు. కాబట్టి, మన వాళ్లకు ఎలాంటి సమస్య లేదు. 

  • Loading...

More Telugu News