: లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించుకోవాల్సిందే!: దాంపత్యం వివాదం కేసులో తేల్చిచెప్పిన హైకోర్టు
వైవాహిక జీవితంలో తలెత్తిన స్పర్థల నేపథ్యంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించుకోవాలని కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధిస్తూ... లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు కాదని, బాధితురాలి కోరిక మేరకు ఆమె భర్త లైంగిక పటుత్వ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. దీని వివరాల్లోకి వెళ్తే... తన భర్తకు లైంగిక పటుత్వం లేదని, ఈ విషయాన్ని దాచి తనను పెళ్లి చేసుకున్నారని, అనంతరం అధిక కట్నం కోసం వేధిస్తున్నారంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు దర్యాప్తులో పటుత్వ పరీక్ష చేయించుకొవాలన్న పోలీసుల డిమాండ్ ను ఆమె భర్త నిరాకరించాడు. అది తన స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నాడు. దీంతో కేసు కోర్టుకు చేరింది. మేజిస్ట్రేట్ పోలీసుల అభ్యర్థనను తిరస్కరిస్తూ పిటిషన్ కొట్టేశారు. దీనిపై పోలీసులు సెషన్స్ కోర్టుకు అప్పీల్ చేశారు. దీంతో విచారించిన సెషన్స్ కోర్టు ఆయన పటుత్వ పరీక్షలు నిర్వహించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ఆమె భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు సెషన్స్ కోర్టు ఉత్తర్వులను సమర్థించారు.