: పేద కార్మికులకు హర్యానా ప్రభుత్వం తక్కువ ధరకే టిఫిన్, మీల్స్!
పేద కార్మికుల ఆకలి తీర్చడం కోసం హర్యానా ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఛండీగఢ్ లోని కార్మికుల కడుపు నింపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖతో సమావేశమై చర్చించి, అంత్యోదయ అన్న పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకంలో భాగంగా కార్మికులకు కేవలం ఐదు రుపాయలకే అల్పాహారం, పది రూపాయలకు సంపూర్ణ భోజనాన్ని హర్యానా ప్రభుత్వం అందించనుంది. కార్మికులు పని చేసే చోట వాహనాల ద్వారా వీటిని సమకూర్చనున్నారు. నెలరోజుల్లో ఈ పథకం ప్రారంభం కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, ఇలాంటి పథకాలన్నింటికీ స్పూర్తి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన రూపాయికే సాంబార్ ఇడ్లీ పథకమన్న సంగతి తెలిసిందే.