: తమిళనాట కలకలం....వేదనిలయం ఇళవరసి పేరు మీదుందా?
జయలలిత ఎంతో ఇష్టంగా కట్టించుకుని, జీవితాంతం నివసించిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం శశికళ వదిన ఇళవరసి పేరుమీద ఉన్నట్టు డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి. దీంతో తమిళనాట అంతా మన్నార్ గుడి మాఫియా జయలలిత ఆస్తులు ఆక్రమించుకునేందుకు పథకం రచించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లు వెలుగులోకి రావడం వల్లే దీపక్ స్పందించి, మేనత్త జయలలిత ఆస్తులకు వారసులము తామేనని ప్రకటించాడని తెలుస్తోంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప కొత్త రాజకీయ పార్టీ ప్రకటించింది. ఆమె వారసురాలిని తానేనని, ఆమె ఆస్తులు తనకు వద్దని, ఆమె దీవెనలు చాలని అంటోంది.
ఇంకో వైపు జయలలితకు నమ్మినబంటుగా పేరున్న పన్నీరు సెల్వం మన్నార్ గుడి మాఫియా లక్ష్యంగా రాజకీయ పోరాటం ప్రారంభించానని తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళ జైలు నుంచి ఈ ముగ్గుర్నీ ఎలా ఎదుర్కొననున్నారన్న ఆసక్తి రేగుతోంది. వీరిని ఎదుర్కోవాలంటే అధికారం తన కుటుంబం చెప్పుచేతల్లో ఉండాలని పథకం రచించి, దాని అమలులో భాగంగానే పార్టీ కార్యనిర్వాహక సెక్రటరీ బాధ్యతలు తన మేనల్లుడు దినకరన్ కు అప్పగించింది. దీంతో మన్నార్ గుడి మాఫియాలో దినకరన్ త్వరలో సీఎం అంటూ ప్రచారం మొదలైంది. ఈ పరిణామాలన్నీ తమిళ ప్రజలకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో తమిళ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.