: అమెరికాలో మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబానికి వెల్లువెత్తిన విరాళాలు!
అమెరికాలోని కన్సాస్ లోని ఓ బార్ లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్ (32) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో యువకుడు అలోక్ గాయాలతో బయటపడ్డాడు. శ్రీనివాస్, అలోక్ ఇద్దరూ జీపీఎస్-గార్మిన్ సంస్థలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. దీంతో శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని పిలుపునిస్తూ, గతంలో అతనితో కలిసి పని చేసిన కవిప్రియ ముతురామలింగం 'గో ఫండ్ మి' పేజ్ క్రియేట్ చేశారు. అందులో...‘శ్రీనివాస్ చాలా దయగల వ్యక్తి, అందరితోనూ ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉండేవారు, ఆయనకు ద్వేషం అనే పదమే తెలియదు, చిన్న గాసిప్ కానీ, బాధ్యతలేని మాటలు కానే మాట్లాడేవారు కాదు, చాలా బ్రిలియంట్, చాలా గొప్ప వ్యక్తి’...అంటూ కవిప్రియ.. శ్రీనివాస్ గురించి వివరిస్తూ ఈ పేజ్ లో పోస్ట్ చేశారు.
దీంతో అకారణంగా విద్వేషానికి బలైన శ్రీనివాస్ కుటుంబానికి సహాయం చేసేందుకు భారీ ఎత్తున ముందుకువచ్చారు. 1,50,000 (99,98,100.36 రూపాయలు) డాలర్ల సేకరణ లక్ష్యంగా ఆమె ఈ పేజ్ క్రియేట్ చేయగా, ఆమె ఊహించని విధంగా 2,27,500 (1,51,63,785.55 రూపాయలు) డాలర్లు సమకూరాయి. ఈ మొత్తాన్ని శ్రీనివాస్ భార్య సునయనకు కవిప్రియ అందజేయనున్నారు. అలాగే అమెరికా నుంచి శ్రీనివాస్ మృతదేహాన్ని భారత్ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు.