: అమెరికాలో శ్వేత జాతీయుడి ఘాతుకం.. తెలుగువాడి కాల్చివేత
అమెరికాలో జాతి వివక్ష మరో తెలుగువాడి ప్రాణం తీసింది. ఓ బార్లో జరిగిన వాగ్యుద్ధంలో రెచ్చిపోయిన అమెరికన్ ఓ తెలుగు వ్యక్తిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి కాన్సస్ రాష్ట్రంలోని ఓలెత్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్’లో తెలుగువారైన శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసానిలతో ఆడమ్ ప్యూరిన్టన్ అనే వ్యక్తి ‘మీరు నాకంటే ఎందులో గొప్పో’ చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. దీంతో తాగిన మత్తులో ఉన్న ప్యూరిన్టన్ ను బార్ సిబ్బంది బయటకు పంపించేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే తుపాకితో తిరిగొచ్చిన ప్యూరిన్టన్ శ్రీనివాస్, అలోక్ లపై కాల్పులు జరిపాడు.
కాల్పులకు ముందు ‘మా దేశం వదిలిపోండి.. టెర్రరిస్ట్’ అని అరిచాడని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక కాల్పులు జరుపుతున్న ప్యూరిన్టన్‌ను అడ్డుకునేందుకు ఇయాన్ గ్రిల్లోట్ అనే అమెరికన్ ప్రయత్నించడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. అతడి చేయి, భుజంలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా అలోక్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ టీంలో పనిచేస్తున్నట్టు గార్మిన్ కంపెనీ తెలిపింది. కాల్పుల ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు ఓ బార్లో దాక్కునేందుకు ప్రయత్నించిన ప్యూరిన్టన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా దుండగుడి కాల్పులకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల 2005లో హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఏవియేషన్ ప్రోగ్రాంలో ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకున్న అలోక్ మాడసాని గార్మిన్ కంపెనీలో ఏవియేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.