: ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి పంకజ ముండే రాజీనామా
బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండేకు మంచి పట్టున్న ప్రాంతం ముంబయ్ లోని పర్లీ. ఇక్కడి నుంచి ఆయన కుమార్తె పంకజ ముండే అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బీద్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. 10 స్థానాలకు ఎన్నికలు జరగగా, బీజేపీ కేవలం రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది. బీద్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో పర్లీ నియోజకవర్గంలో మొత్తం నాలుగు స్థానాలుండగా, ఆ నాలుగింటిలో బీజేపీ ఓటమిపాలైంది. ఈ నాలుగింట్లో మూడింటిని ఎన్సీపీ, ఒకదానిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాయి.
దీంతో నియోజకవర్గంలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పంకజ ముండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె రాజీనామా లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు పంపారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ రావు సాహెబ్ దన్వె మాట్లాడుతూ, ఈ ఓటమితో రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆమె స్థానం పార్టీలో, ప్రభుత్వంలో విలువైనదని అన్నారు. ఆమెతో మాట్లాడి నచ్చజెబుతానని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కూడా ఆమె రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.