: బృహన్ ముంబై ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా శివసేన!


ముంబైలో తమకు తిరుగులేదని శివసేన మరోసారి నిరూపించింది. బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికలు సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో పట్టు సాధించేందుకు బీజేపీ, శివసేన తీవ్రంగా ప్రయత్నించాయి. ఆ రెండు పార్టీలకు తోడు ఎన్సీపీ కూడా గట్టి ప్రచారం చేసింది. ఈ సారి ఎలాగైనా బృహన్ ముంబై కార్పొరేషన్ లో సత్తాచాటాలని బీజేపీ సుదీర్ఘకాలంగా ఉన్న పొత్తుకు మంగళంపాడింది. ఈ నేపథ్యంలో శివసేన బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అంతే కాకుండా ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నారంటూ శివసేన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 227 కార్పొరేషన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కడపటి వార్తలందే సరికి శివసేన 84 స్థానాల్లో విజయం సాధించింది. తరువాతి స్థానంలో 81 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఉంది. మూడో స్థానంలో 31 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ఆకట్టుకోగా, ఇతరులు 20 స్థానాల్లో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ 114 ను శివసేన, బీజేపీ పార్టీలు రెండూ చేరుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు మళ్లీ బీజేపీ, శివసేన ఒకటవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండూ కలసి అధికారాన్ని పంచుకోకపోయినా, ఎవరో ఒకరికి మరొకరు బయట నుంచి మద్దతు ఇవ్వాల్సి వుంటుంది. ఎందుకంటే, కాంగ్రెస్ తో వీరిద్దరూ కలిసే సమస్యే లేదు కాబట్టి. వీరికి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రధాన శత్రువు. మరి చివరికి ఏమవుతుందో చూడాలి. 

  • Loading...

More Telugu News