: ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా...ఒంటరి పోరాటం చేసిన ఓపెనర్


పూణే వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ కోహ్లీ ఉచ్చులో పడిపోయింది. ఈ మ్యాచ్ కి ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెటరన్ లు భారత్ తో సిరీస్ పై ఆస్ట్రేలియాను హెచ్చరించి మరీ పంపారు. దీంతో భారత్ ను ఎదుర్కొనేందుకు దీటైన ప్రణాళికలు రచించుకుని అడుగుపెట్టిన ఆసీస్ ఆటగాళ్లు తొలిరోజే చేతులెత్తేశారు. ఒపెనర్ రెన్ షా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. సహచరులంతా వెనుదిరుగుతున్నా మొక్కవోని దీక్షతో ఆడాడు. ఒంటరిపోరాటం చేసే క్రమంలో అతను అర్ధ సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బౌలింగ్ చేపట్టిన భారత్ తొలి ఒవర్ ను ఉమేష్ యాదవ్ తో వేయించింది.

వెంటనే స్పిన్నర్ అశ్విన్ ను రంగంలోకి దించి, ఆసీస్ తో మైండ్ గేమ్ ప్రారంభించాడు కోహ్లీ...దీంతో ఆసీస్ టాపార్డర్ కోహ్లీ ఉచ్చులో పడింది. కోహ్లీ ఊహించినట్టే వరుసగా ఆసీస్ ఆటగాళ్లు ఒత్తిడికి తలొగ్గారు. ఈ క్రమంలో రెన్ షా (64), డేవిడ్ వార్నర్ (38), స్టీవ్ స్మిత్ (27), షాన్ మార్ష్ (16), హ్యాండ్స్ కొంబ్ (22), మిచెల్ మార్ష్ (4), మాధ్యూ వేడ్ (8) అవుటయ్యారు. క్రీజులో మిచెల్ స్టార్క్ (2), ఒకీఫ్ (0) ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 79.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ చెరి రెండేసి వికెట్లు తీయగా, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. తొలిరోజు ఆటముగిసేందుకు మరో 10 ఓవర్లు మిగిలి ఉండడంతో తొలిరోజే ఆసీస్ ఇన్నింగ్స్ ను ముగించాలని భారత్ భావిస్తోంది. 

  • Loading...

More Telugu News