: టీజేఏసీలో లుకలుకలు.. కోదండరామ్ పై విమర్శలు.. సమావేశాన్ని బహిష్కరించిన కన్వీనర్


కేసీఆర్ సర్కార్ పై టీజేఏసీ సమరశంఖం పూరించిన కొన్ని గంటల్లోనే... జేఏసీలో లుకలుకలు మొదలయ్యాయి. జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పై జేఏసీ నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఒంటెద్దు పోకడలకు వెళుతున్నారని నేతలు అసహనం వ్యక్తం చేశారు. నాగోల్ లో నిరుద్యోగ ర్యాలీని నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చినా... ర్యాలీని ఎందుకు నిర్వహించలేదని కొందరు నేతలు ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కోదండరామ్ పాకులాడుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన టీజేఏసీ స్టీరింగ్ కమిటీ మీటింగ్ ను కన్వీనర్ పిట్టల రవీందర్ సహా మరికొందరు నేతలు బహిష్కరించారు.

ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ... నాగోల్ లో సభ నిర్వహించడానికి కోదండరామ్ అయిష్టత చూపారని కొదరు జేఏసీ నేతలు చెప్పారు. నగర నడిబొడ్డులోనే ర్యాలీని నిర్వహించాలని ఆయన పట్టుబట్టారని విమర్శించారు. నగర నడిబొడ్డున కాకున్నా... ఏదో ఒక చోట ర్యాలీ నిర్వహించి ఉంటే, నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి వెళ్లేవని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, తాము సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు.

  • Loading...

More Telugu News