: భారత్లో మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారు: నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్
నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఢిల్లీలో తన ‘సోషల్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్’ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగం చేస్తూ దేశంలోని యూనివర్సిటీల్లో పరిస్థితుల గురించి మాట్లాడారు. వర్సిటీల్లో భయానక వాతావరణం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన వ్యాఖ్యానించారు. సర్కారు నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై విమర్శనాత్మక ప్రసంగాలు చేసే ప్రొఫెసర్లతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవడం సమకాలీన భారత్లో స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. విధాన రూపకల్పనల్లో సమానత్వం కోసం చేయాల్సిన ప్రయత్నాలు సరిగా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు.
అంతేగాక, భారత్లోని మైనారిటీలు భయాందోళనలకు గురవుతున్నారని అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లో సోదరభావం పెంపొందించే అంశంలో అది అడ్డుగోడగా మారిందని చెప్పారు. దేశంలో ఆరోగ్య రంగం వృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తుందన్న నమ్మకం తనకు లేదని చెప్పారు. చైనా తన జీడీపీలో 2 శాతం ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తుందని చెప్పిన ఆయన.. మనదేశంలో కేవలం 1 శాతం కన్నా తక్కువ ఖర్చుచేస్తున్నారని అన్నారు.