: జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం.. టెలినార్‌ను కొనుగోలు చేస్తోన్న ఎయిర్‌టెల్
టెలికం రంగంలో మరో విలీనం జరగనుంది. ఇప్పటికే 269.40 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్న ఎయిర్‌టెల్.. యూనిటెక్ నుంచి విడిపోయిన టెలినార్ ఇండియాను కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలులో టెలినార్ ఇండియా ఆస్తుల బదలాయింపు అంశం కూడా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. దీంతో ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందనుంది. కొన్ని రోజుల క్రితమే ఐడియా - వొడాఫోన్ విలీనం జరగనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజులకే ఎయిర్‌టెల్-టెలినార్ ఇండియా కూడా అదే బాటలో పయనిస్తుండడం ఆసక్తి రేపుతోంది. మార్కెట్లో రిలయన్స్ జియో నుంచి వస్తోన్న పోటీ నేపథ్యంలో తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఎయిర్ టెల్ ఈ కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను తాము కొనుగోలు చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ ఈ రోజు చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా, ఎంత మొత్తంలో కొనుగోలు చేయబోతుందనే విషయంతో పాటు పలు విషయాలను ఎయిర్‌టెల్ ప్రకటించలేదు. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి చేయాలని ఎయిర్ టెల్ భావిస్తోంది.