: వందల కోట్ల చాయ్ వాలాకు.. ఈడీ ఝలక్
గుజరాత్ లోని సూరత్ కు చెందిన చాయ్ వాలా కిషోర్ భజియావాలా గుర్తున్నాడా? చాయ్ వ్యాపారంతో జీవితాన్ని మొదలెట్టి, ఆ తర్వాత వడ్డీ వ్యాపారం చేస్తూ దాదాపు రూ. 650 కోట్ల వరకు సంపాదించాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత... ఈయన విషయం వెలుగులోకి వచ్చింది. తన వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా... ఈయనగారి భాగోతం బయటపడింది.
గతంలోనే ఆయన నివాసాలు, కార్యాలయాలపై దాడి చేసిన ఐటీ అధికారులు కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తమ సోదాల్లో లెక్కల్లో చూపని రూ. 10.45 కోట్ల డబ్బును ఐటీ అధికారులు గుర్తించారు. అంతేకాదు, అతని వద్ద వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు అంచనా వేశారు. తాజాగా రూ. 1.02 కోట్ల ఆయన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002 కింద ఆస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది. అంతేకాదు, ఆయన అక్రమాస్తులపై దర్యాప్తును వేగవంతం చేసింది. మరిన్ని ఆస్తులను జప్తు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈయన కేసును సీబీఐ కూడా విచారిస్తోంది.