: జియోను తలదన్నే ఆఫర్ ప్రకటించిన ఎయిర్ టెల్
వెల్ కమ్ ఆఫర్లతో దేశీయ టెలికాం కంపెనీలకు జియో ముచ్చెమటలు పట్టించింది. అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో, జియోను తలదన్నే ఆఫర్ ను ఎయిర్ టెల్ ప్రకటించింది. కేవలం రూ. 100కి అదనంగా 10 జీబీ వరకు 3జీ, 4జీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాన్ లకు ఈ డేటాను అదనంగా అందించనుంది.
మంగళవారం నాడు తన ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను జియో ప్రకటించిన నేపథ్యంలో, ఎయిల్ టెల్ ఈ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అంతేకాదు, జియో కంటే చీప్ గా డేటా ఆఫర్లను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది ఎయిర్ టెల్. అయితే, ఈ ఆఫర్ కొన్ని వారాల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎయిర్ టెల్ ప్రతినిధి తెలిపారు. మొత్తం 28 రోజుల వరకు ఈ 10జీబీ ఆఫర్ ఉంటుందని చెప్పారు. గత ఏడాది రూ. 259కి 10జీబీ ఆఫర్ ను ఎయిల్ టెల్ అందించింది.