: పోలీసులతో లెక్కలు చెప్పించుకున్న పదేళ్ల చిన్నారి.. నెటిజన్ల నుంచి విశేష స్పందన!
ఓహియోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పదేళ్ల ఓ చిన్నారి పోలీసులతో లెక్కలు చెప్పించుకుంది. సాధారణంగా ప్రజలు తమకు ఏదైనా సమస్య వస్తే పోలీసులని ఆశ్రయిస్తారు. అందుకోసం సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకుంటున్నారు. అయితే, ఈ చిన్నారికి లెక్కలు సరిగా రావట్లేదట. దీంతో పోలీసులను సాయం చేయమని కోరుతూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఆ పోస్టుకి ఓహియో పోలీసు అధికారి ఒకరు దానికి స్పందించారు. పోలీసులకి, ఆ చిన్నారికి జరిగిన సంభాషణను ఆ చిన్నారి తండ్రి సోషల్ మీడియాలో ఉంచారు. ఇప్పుడు ఆ పోస్టు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
లీనా డ్రేపర్ (10) అనే బాలిక ఐదవ తరగతి చదువుతోంది. తనకు లెక్కలకు సంబంధించిన ఓ ప్రశ్న సమస్యగా మారిందని, ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా తెలిపింది. ఆమె చెప్పిన లెక్కను ఎలా పరిష్కరించాలో పోలీస్ అధికారి చెప్పారు. అనంతరం (90+27) + (29+15) x 2 అనే లెక్కను ఆ పోలీసదికారి ముందు ఉంచి, అది కూడా ఎలా చేయాలో చెప్పమని మళ్లీ అడిగింది. గణితంలో మంచి పట్టు ఉన్న ఆ అధికారి స్పందిస్తూ ముందుగా మొదటి బ్రాకెట్‌లోవి కలపాలని, తర్వాత రెండో బ్రాకెట్‌లోవి కలపాలని చెప్పాడు. ఆ రెండు బ్రాకెట్ల ఆన్సర్లను కలిపి వచ్చిన ఆన్సరును చివరిగా రెండుతో గుణించాలని చెప్పారు. ఈ పోస్ట్ పట్ల నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.