: తనని చూడడానికి జైలుకి రావద్దని తమిళనాడు సీఎంకి సూచించిన శశికళ
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ జైలు శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. జైలు నుంచే తమ పార్టీ నేతలకు సూచనలు పంపుతున్న ఆమె.. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఓ సందేశం పంపారు. తనని కలవడానికి ఎవ్వరూ జైలుకు రావద్దని శశికళ ఆదేశించారు. శశికళ సోదరి కుమారుడు, అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ ఇటీవల శశికళను కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా, తనని కలవడానికి జైలుకి రావద్దని పళనిస్వామికి చెప్పాల్సిందిగా దినకరన్‌ని కోరారు. తనను కలిసేందుకు వచ్చే బదులు చేయాల్సిన పనులపై దృష్టిపెట్టాలని చెప్పాల్సిందిగా సూచించారు. జయలలిత అప్పజెప్పిన పనులను ఎటువంటి విరామం లేకుండా నిర్వహించాలని చెప్పారు.
దీంతో ఆమెను కలవాలనుకున్న పళనిస్వామి తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. కాగా, పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, సరస్వతిలతో పాటు పలువురు నిన్న శశికళను కలవడానికి బెంగళూరు జైలుకు వెళ్లగా వారితో మాట్లాడడానికి శశికళ నిరాకరించారు.