: కోహ్లీతో పోల్చుతుండటంతో మండిపడుతున్న పాక్ క్రికెటర్
పాకిస్థాన్ క్రికెట్ గత కొంత కాలంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు క్రీడా విశ్లేషకులు, అభిమానుల విమర్శలు వీరిని మరింత ఇరిటేట్ చేస్తున్నాయి.
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఉమర్ అక్మల్, అహ్మద్ షెహజాద్ లను పోలుస్తూ... పాక్ క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. వీరు ముగ్గురూ దాదాపు ఒకే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. ప్రపంచ రికార్డులను చెరిపేస్తూ కోహ్లీ దూసుకుపోతుంటే... వీరిద్దరు మాత్రం వెనుకబడిపోయారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరిపై పాక్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
దీంతో, ఉమర్ అక్మల్ తన బాధను వ్యక్తీకరించాడు. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడని... తాను ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తానని చెప్పాడు. ఒకవేళ తనను కోహ్లీతో పోల్చాలనుకుంటే అభిమానులు కానీ, విశ్లేషకులు కానీ రెండు కండిషన్లు పాటిస్తే బాగుంటుందని చెప్పారు. ఒకటి, కోహ్లీని ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయించడం... రెండోది తాను వన్ డౌన్ లో బ్యాటింగ్ కు రావడం అని తెలిపాడు. ఇద్దరూ ఒకే స్థానంలో బ్యాటింగ్ కు దిగినప్పుడైతేనే... ఇద్దరి మధ్య పోలిక పెట్టడం సమంజసమవుతుందని అసహనం వ్యక్తం చేశాడు.