: ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న అక్కినేని నాగార్జున, జీవీకే కుటుంబసభ్యులు


ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ల వివాహం రద్దయినట్టు విశ్వసనీయ సమాచారం. అధికారికంగా దీనిపై ఇటు నాగార్జున కాని, అటు జీవీకే కుటుంబసభ్యులు కానీ స్పందించనప్పటికీ ఇది పక్కా సమాచారమే అని తెలుస్తోంది. హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో గత డిసెంబర్ 9న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ అట్టహాసంగా జరిగింది. పెళ్లిని ఇటలీలోని రోమ్ లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అక్కడ హోటల్స్, రిసార్ట్స్ అన్నీ బుక్ చేశారు. పెళ్లి వేదికను కూడా బుక్ చేశారు. ట్రావెల్ బుకింగ్స్ కూడా జరిగిపోయాయి. 700 మంది ప్రముఖులు ఈ పెళ్లికి హాజరుకావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో, వారం చివరి వరకు కూడా అంతా బాగానే ఉందట. సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనే నిర్ణయానికి ఇరు కుటుంబాలు వచ్చాయి. పెళ్లికి హాజరు కావడానికి ఇటలీకి ఎయిర్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న కొందరికి... ఇరు కుటుంబాలను నుంచి సమాచారం వెళ్లింది. టికెట్లను బుక్ చేసుకోవద్దంటూ వారికి సూచించారు. అంతేకాదు, ఇరు కుటుంబాలు కూడా ఎయిర్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాయి. ఈ రెండు కుటుంబాలకు అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం, హటాత్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లి ఆగిపోవడం వల్లే, టికెట్స్ బుక్ చేసుకోవద్దంటూ ఇరు కుటుంబాలు సూచించినట్టు సమాచారం. వాస్తవానికి అఖిల్, శ్రియలతో నాగార్జున, జీవీకే ఇద్దరూ మాట్లాడి, సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. కానీ, ఏ మాత్రం ఫలితం లేకపోవడంతో చివరకు పెళ్లి క్యాన్సిల్ చేశారని సమాచారం. అయితే, ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.

శ్రియాభూపాల్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తోంది. న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ లో ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. లేబుల్ శ్రియ అనే పేరుతో ఆమెకు సొంతంగా డిజైనరీ సంస్థ ఉంది. అంతేకాదు, బాలీవుడ్ తారలు అలియా భట్, శ్రద్ధా కపూర్, రాధికా ఆప్టేలతో పాటు టాలీవుడ్ నటీమణులు శ్రియ శరణ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులకు ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది.  

22 ఏళ్ల అఖిల్, 26 ఏళ్ల శ్రియాభూపాల్ లు గత రెండేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నారు. కాలక్రమంలో మనసులు దగ్గరై, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి నిర్ణయాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఇటలీలో అట్టహాసంగా పెళ్లి చేయాలని నిర్ణయించాయి. కానీ, ఇంతలోనే ఇలా జరిగిపోయింది! 

  • Loading...

More Telugu News