: ధోని ఫోన్లో కూడా మాకు దొరికేవాడు కాదు!: పుణె యజమాని గోయెంకా సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ స్కిప్పర్ మహేంద్రసింగ్ ధోనిపై పుణె సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జట్టు యజమానులమైన తమను ధోని లేశమాత్రమైనా పట్టించుకోలేదన్న అర్థం వచ్చేలా పలు విషయాలు పేర్కొన్నారు. ధోని ఎప్పుడూ ఫోన్‌లైన్లో కూడా తమకు అందుబాటులోకి రాలేదని, కీలక సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజెంట్ అరుణ్ పాండే ద్వారా మాత్రమే అతడిని కలిసే వీలుండేదని పేర్కొన్నారు. గతేడాది లీగ్ సమయంలో కూడా ధోని జట్టు సమావేశాల్లో పాల్గొనలేదని పేర్కొన్న గోయెంకా, సమావేశంలో చర్చించిన దానికి భిన్నంగా ఫీల్డింగ్‌ను ధోని మార్చేశాడని ఆరోపించారు. సమావేశంలో ఏం చర్చించారన్న విషయం కూడా ధోనికి తెలియదని ఓ సీనియర్ ఆటగాడు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు వివరించారు.
నెట్ ప్రాక్టీసులకు ధోని హాజరు కాడని, లెగ్ స్పిన్నర్ జంపాను తుదిజట్టులోకి తీసుకోమని చెబితే.. తానెప్పుడూ అతడి ఆటను చూడలేదని చెప్పి తమకు షాకిచ్చాడని గోయెంకా తెలిపారు. దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శన బాగాలేకున్నా సౌరభ్ తివారీని తీసుకోవాలని ధోని ఒత్తడి తెచ్చాడని, జట్టు జెర్సీ రంగు, డిజైన్ గురించి అతడి సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. ఈ కారణంగానే అతడిని క్రికెటేతర అంశాల్లో జోక్యం చేసుకోనీయకూడదని ఆర్పీడీ టీం భావించిందన్నారు. ఇదే విషయాన్ని ధోనికి చెబితే.. ‘నేను ఆటగాడిగానే ఉంటా. మీకు ఏది సరైందని అనిపిస్తే అదే చేయండి’ అని అన్నాడని గోయెంకా తెలిపారు. నిజాలను ముఖం మీదే చెప్పడం తనకు అలవాటని, ఫ్రాంచైజీల మేలు కోరే ధోనిని తప్పించామని వివరించారు.