: పళనిస్వామి ఆదేశాలతో రూ. వెయ్యికోట్లు నష్టపోనున్న తమిళనాడు!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఒకే ఒక్క ఆదేశంతో రాష్ట్రం అక్షరాలా వెయ్యికోట్ల రూపాయలు నష్టపోనుంది. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పళనిస్వామి సోమవారం 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ప్రజలకు మరో నాలుగు వరాలు కూడా ప్రకటించారు.
గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జయలలిత ముఖ్యమంత్రి కాగానే 500 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు గద్దెనెక్కిన పళనిస్వామి మరో 500 మద్యం షాపుల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల ప్రకారం దుకాణాలు మూతపడితే రాష్ట్ర ఖజానాకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లనుంది. ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా 5,700 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఏడాది మార్చి నాటికి రూ.24 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. కాగా వచ్చే నెలలో సర్వే చేసిన అనంతరం రాష్ట్రంలో మూసివేయనున్న మద్యం షాపులను జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది.