: కూతురి పెళ్లికి 500 మందిని, కొడుకు పెళ్లికైతే 400 మందిని మాత్రమే పిలవాలి!: జమ్ముకశ్మీర్ సర్కారు ఆదేశాలు
పెళ్లి వేడుక అంటే అంబరాన్ని తాకేలా సంబరాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. బంధుమిత్ర సపరివార సమేతంగా రావాలని శుభలేఖలు అచ్చువేయిస్తారు. పెళ్లికి ఎంతమంది వస్తే అంతగొప్పగా భావిస్తారు. మా కూతురి పెళ్లికి రెండు వేల మంది వచ్చారు.. మా అబ్బాయి పెళ్లికయితే మూడు వేల మంది వచ్చారు.. అని గొప్పగా చెప్పుకుంటారు. అయితే, అటువంటి తీరుకి ఇక ఫుల్‌స్టాప్ పెట్టాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రజలకు చెబుతోంది. ఇకపై కూతురి పెళ్లికైతే 500 మంది, కొడుకు పెళ్లికైతే 400 మందిని మాత్రమే పిలవాలని నిబంధనలు విధించింది.
అంతేకాదు, పెళ్లివేడుకలో ఏడు రకాల వంటలను మాత్రమే వడ్డించాలని కూడా ఆంక్షలు విధించింది. ఎక్కువగా వండి వాటిని వృథా చేయకూడదని చెప్పింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అలాగే నిశ్చితార్థం లాంటి చిన్న ఫంక్షన్లకైతే గరిష్ఠంగా వంద మందిని మాత్రమే పిలుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, సామాజిక ఫంక్షన్లలో ఎక్కడైనా సరే లౌడ్ స్పీకర్లు వాడకూడదని, టపాసులు పేల్చకూడదని చెప్పింది. అంతేకాదు,
శుభలేఖలతో పాటు స్వీట్లు గానీ డ్రై ఫ్రూట్లు గానీ పంపడానికి కూడా వీల్లేదని పేర్కొంది.