: శశికళను కలిసేందుకు వెళ్లిన మంత్రులకు చుక్కెదురు!


అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కలిసేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రులకు చుక్కెదురైంది. పళనిస్వామి కేబినెట్ లోని మంత్రులు డి.శ్రీనివాసన్, సెంగొట్టాయన్, సెల్లూర్ రాజు లు చెన్నై నుంచి ఈ రోజు అక్కడికి వెళ్లారు. అయితే, మూడు గంటల పాటు వారు నిరీక్షించిన అనంతరం, శశికళను కలిసేందుకు జైలు అధికారులు వారికి అనుమతి ఇవ్వలేదు. ఆమెను కలిసేందుకు వచ్చే వారం రావచ్చని అధికారులు చెప్పడంతో, ముగ్గురు మంత్రులు నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది.

అయితే, జైలు అధికారులు ఎందుకు అనుమతించలేదనే విషయమై జైలు అధికారులు మాట్లాడుతూ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజనర్స్ ప్రకారం, జైలులో ఉన్న ఖైదీని కలిసేందుకు వారానికి రెండు రోజులు మాత్రమే అవకాశమిస్తామని, ఈ కారణంగా శశికళను కలిసేందుకు తమిళనాడు మంత్రులను నిరాకరించారని అన్నారు.  ఇదిలా ఉంచితే, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ అక్క కొడుకు దినకరన్  ఆమెను నిన్న కలిశారు. శశికళను కలిసేందుకు పలువురు నాయకులు వస్తుండటంతో ఈ వారానికి ఆమె కోటా పూర్తయినట్లు జైలు అధికారుల సమాచారం.

  • Loading...

More Telugu News