: లాటరీ తగిలిందని ఫోన్ చేస్తున్నారు... లక్షలకు లక్షలు లాగేస్తున్నారు.. జర భద్రం!


ఆన్‌లైన్ షాపింగ్‌లు చేస్తోన్న వారిపై క‌న్నువేసి ఉంచిన కేటుగాళ్లు వారికి డ‌బ్బు ఆశ చూపించి, మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. లాట‌రీ త‌గిలింద‌ని, ల‌క్కీ క‌స్ట‌మ‌ర్‌గా ఎంపిక‌య్యార‌ని, వెయ్యి మందిలో ఒక‌రికి వ‌చ్చే ప్రైజ్ మ‌నీ మీకే త‌గిలింద‌ని న‌మ్మించి ముంచేస్తున్నారు. వెయ్యి మందిని బుట్ట‌లో ప‌డేసే ప్ర‌య‌త్నాలు చేస్తే ఒక్క‌ర‌యినా ప‌డ‌క‌పోతారా? అని భావిస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. బంగారం, న‌గ‌లు, భారీగా డ‌బ్బు గెలుచుకున్నార‌ని న‌మ్మించి మోసానికి పాల్ప‌డుతున్నారు. ఇటువంటి మోసానికి గురైన ఓ దంప‌తులు తాజాగా పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

త‌మ‌కి నాప్‌టాల్‌ సంస్ధ పేరిట మెసేజ్ వ‌చ్చింద‌ని, 70 లక్ష‌ల రూపాయ‌లు లాట‌రీ త‌గిలింద‌ని చెప్పి, ఆ నగదును చెల్లించేందుకు టాక్స్‌, ఇతర ఛార్జీలు కలిపి కొంత డ‌బ్బు చెల్లించాల‌ని అన్నార‌ని వారు తెలిపారు. దీంతో తాము కొద్ది కొద్దిగా డ‌బ్బు చెల్లిస్తూ వ‌చ్చామ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం రూ. 8.6 లక్షలు చెల్లించామ‌ని పేర్కొన్నారు. స‌ద‌రు కేటుగాళ్ల మాట‌లు న‌మ్మిన ఆ దంప‌తులు తమకున్న నాలుగెకరాల్లో రెండకరాలు అమ్మి మ‌రీ ఈ నగదును చెల్లించారు. బాధితులు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మవారిపాళెంకు చెందిన ఎం.రాఘవేంద్ర, ప్రసన్న దంపతులని, వారు వ్యవసాయం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. వారు టీవీల్లో, ఇతర సోషల్‌ నెట్‌వర్క్‌లలో వస్తున్న ప్రచార ప్ర‌భావంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు.

ప్రసన్న మూడు నెలల క్రితం నాప్‌టాల్‌ కంపెనీలో జ్యూయలరీ సెట్‌, పంజాబీ డ్రస్‌లు, మొబైల్‌కు ఆర్డర్‌ ఇచ్చారని పోలీసులు తెలిపారు. అనంత‌రం వారికి ఓ ఫేక్‌కాల్ వ‌చ్చింద‌ని, దాంతో ఆ దంప‌తులు మోస‌పోయార‌ని పోలీసులు అన్నారు. తమ గిఫ్ట్‌ ఇవ్వమంటూ తాజాగా ఆ దంప‌తులు నిల‌దీశార‌ని, దీంతో ఫోన్‌కాల్ చేసిన వ్య‌క్తులు మొత్తం 10 ల‌క్ష‌ల రూపాయ‌లు క‌డితేనే ఇస్తామ‌ని అన్నార‌ని పోలీసులు చెప్పారు. దీంతో అనుమానం వ‌చ్చిన ఆ దంప‌తులు త‌మ‌ను ఆశ్ర‌యించార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News