: చిన్న ఆపరేషన్ తో షుగర్ వ్యాధికి పూర్తిగా చెక్.. చరిత్రకెక్కనున్న హైదరాబాద్
మధుమేహం... ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి. మన దేశంలో కూడా ఈ షుగర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి యేటా పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి కష్టం అంతా ఇంతా కాదు. క్రమం తప్పకుండా మందులు, తీవ్రత ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ వాడాల్సిందే. ప్రతి రోజూ నడకలాంటి వ్యాయామాలు తప్పనిసరి. వీటన్నింటికన్నా ముఖ్యం... నోటిని కట్టేసుకోవాలి. కంటి ముందు అన్నీ ఉన్నా... ఏది పడితే అది తినలేని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఆపరేషన్ తో ఈ వ్యాధిని సమూలంగా నిర్మూలిస్తే... ఈ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. ఎస్... ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అదే నిజమైన రోజున ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రమే మారుతుంది. మరో విషయం ఏమిటంటే, చారిత్రాత్మకమైన ఈ వైద్య విధానానికి మన హైదరాబాద్ వేదికగా మారబోతోంది.
ఎండోస్కోపీ వైద్య విధానంతో మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని మన వైద్యులు గుర్తించారు. ఏడుగురు రోగులపై ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించగా.. అది విజయవంతమైంది. ఈ క్రమంలో, ఈ వైద్య విధానాన్ని మరింత మంది రోగులపై ప్రయోగించి... ఆ తర్వాత వచ్చే ఫలితాలను బట్టి పూర్తి స్థాయిలో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.
ఈ వైద్య విధానం అందుబాటులోకి వస్తే, మందులు, ఇన్సులిన్ లు అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులోని హెచ్ఐసీసీలో మొదటి 'వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ జీఐ ఎండోస్కోపీ' సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎండోస్కోపీ విధానం ద్వారా మధుమేహానికి చెక్ పెట్టే దిశగా విస్తృత పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైద్య విధానం ద్వారా 200 మందికి డయాబెటిస్ ను అదుపులో పెట్టామని తెలిపారు. హైదరాబాదులో ఏడుగురికి ఈ విధానం ద్వారా మధుమేహాన్ని నియంత్రించామని చెప్పారు.
క్లోమంలో ఇన్సులిస్ హెచ్చుతగ్గుల వల్లే గ్లూకోజ్ నియంత్రణలో ఉండదనే భావన సరికాదని డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. చిన్నపేగుల్లో కూడా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుందని... దానిలో మార్పులు చేయడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ఎండోస్కోపి ద్వారా చిన్నపేగుల్లోని ఇన్సులిన్ ను ఎక్కువ లేదా తక్కువ చేయవచ్చని తెలిపారు. చిన్నపేగుల్లో ఉన్న మ్యూకోజ్ ను 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాల్చడం ద్వారా, ఇన్సులిన్ తగు మోతాదులో ఉత్పత్తి అవుతుందని ఆయన చెప్పారు.
ఈ పరిశోధనలు విజయవంతమైతే, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్న మధుమేహం అంతమవుతుంది. ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఈ పరిశోధనలకు హైదరాబాద్ వేదిక కావడం మనందరికీ గర్వకారణం.