: పెద్ద నోట్ల రద్దు విషయంలో బీఎస్పీ ముందుజాగ్రత్త పడలేదా?: మాయావతి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చమత్కారం
ఉత్తరప్రదేశ్‌లోని చివరిదశల్లో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పలు పార్టీలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ రోజు ఒరైలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. తమ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై బీఎస్పీ నేత మాయావతి చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే పెద్ద నోట్లను రద్దు చేసినట్లు మాయావతి ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించిన మోదీ.. బీఎస్పీ ముందుజాగ్రత్త పడలేదా? లేక ప్రభుత్వమా? అని చమత్కరించారు. నోట్ల రద్దు వల్ల బీఎస్పీ పార్టీ తమ ధనాన్ని దాచుకునే వీలులేకుండాపోయిందని ఆయన ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ ప్రస్తుతం బెహన్‌జీ సంపత్తి పార్టీగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ ప్రజల పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, రాష్ట్రంలోనూ తమ ప్రభుత్వం వస్తే అక్కడ ప్రజల అవసరాలను తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.