: ధోనీని తప్పించిన కారణాన్ని వివరించిన పుణె రైజింగ్ సూపర్ జెయింట్స్
భారత క్రికెట్ అభిమానులకు షాకిస్తూ, పుణె రైజింగ్ సూపర్ జెయింట్స్ (ఆర్పీఎస్) ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడం వెనుక అసలు కారణం వెల్లడైంది. ధోనీని తామే తప్పించామని, ఈ విషయాన్ని ముందే తెలియజేసి, అతని అనుమతి తీసుకున్నామని ఆర్పీఎస్ ఓనర్ సంజీవ్ గోయంకా తెలిపారు. ఈ సీజన్ లో తమ జట్టుకు యువకుడైన సారథి కావాలని యోచించామని, అందువల్ల ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ ను ఎంపిక చేశామని, ఈ మార్పునకు స్టీవ్, ధోనీలు అంగీకరించారని వెల్లడించారు. ఆటలో తాను పూర్తిగా సహకరిస్తానని ధోనీ తెలియజేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఉండి, 2010, 2011లో ట్రోఫీలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. గత సీజన్ లో మాత్రం విఫలమై తానాడిన 12 ఇన్నింగ్స్ లో ఒక హాఫ్ సెంచరీతో 284 పరుగులు చేశాడు.