: ఇక జగన్ కంచుకోట బద్దలవుతుంది!: గంటా శ్రీనివాసరావు
వైఎస్ జగన్, తన కంచుకోటలా భావించే కడపలో స్థానిక పోరులో తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధించనున్నారని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కడపలో విజయంతో జగన్ కంచుకోట బద్దలు కావడం మొదలవుతుందని, వైకాపా పతనానికి అదే నాందని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో 70 శాతం మంది తెలుగుదేశం వైపే ఉన్నారని వ్యాఖ్యానించిన ఆయన, జగన్ వంటి నేత ప్రతిపక్షంలో ఉండటం దౌర్భాగ్యమని అభివర్ణించారు. తానే ముఖ్యమంత్రినని పోలీసులపై దౌర్జన్యాలు చేయడం జగన్ కే చెల్లిందని విమర్శించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, పోలవరం, పట్టిసీమలతో రాష్ట్రంలోని ఎన్నో కరవు ప్రాంతాలకు నీరందనుందని అన్నారు. జగన్ చెప్పే మాటలు విని ఎంపీలు ఎవరైనా రాజీనామా చేస్తే, ఆ స్థానాలను తెలుగుదేశం అత్యంత సునాయాసంగా గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం 100 ఓట్ల మెజారిటీతో తాము విజయం సాధిస్తామన్న నమ్మకముందని అన్నారు.