: 2030 నాటికి అన్ని ఇంధన అవసరాలనూ తీర్చనున్న చందమామ: ఇస్రో
మరో 12 సంవత్సరాల తరువాత భారత దేశపు అన్ని ఇంధన అవసరాలనూ చంద్రుడు తీర్చనున్నాడని ఇస్రో శాస్త్రవేత్త శివథాను పిళ్లై అభిప్రాయపడ్డారు. చందమామపై ఉన్న హీలియమ్-3 గనులను తవ్వడం ద్వారా, ఇంధన అవసరాలను తీర్చుకునే స్థాయికి భారత్ ఎదగనుందని 'ఓఆర్ఎఫ్ - కల్పనా చావ్లా స్పేస్ పాలసీ డైలాగ్' మూడు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు.
2030 నాటికి చంద్రుడిపై గనులను తవ్వాలన్న లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, పిళ్లై బ్రహ్మోస్ ఏరోస్పేస్ చీఫ్ గా పని చేశారు. చంద్రడిపై ఉన్న హీలియంను భూమిపైకి తెచ్చే ప్రాజెక్టులో ఇండియాతో పాటు పలు దేశాలు పని చేస్తున్నాయని, మరికొన్ని దశాబ్దాల్లో ప్రజలు హనీమూన్ జరుపుకునేందుకు చంద్రుడిపైకి వెళ్లి వస్తారని అంచనా వేశారు. కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ విభాగాల్లో ప్రపంచంలోనే చెప్పుకోతగ్గ స్థాయికి ఇండియా చేరుకుందని ఆయన అన్నారు.