: సైక్లిస్టుల కోసం చైనా నిర్మించిన ఫ్లై ఓవర్!
మన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, సబ్ వేలు నిర్మిస్తారు. తద్వారా రోడ్లపై రద్దీని తగ్గిస్తారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలోని కొన్ని పట్టణాల్లో నగరపాలక సంస్థలు ఏర్పాటు చేసే ఫ్లై ఓవర్లు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ట్రాఫిక్, కాలుష్యంలో ప్రపంచ నెంబర్ వన్ జాబితాను ఆక్రమించిన చైనాలో రోడ్డుపై పాదచారుల కోసం నిర్మించిన ప్రాంతాల్లోకి కూడా టూవీలర్లు దూసుకొస్తున్నాయి. దీంతో పాదచారులు, సైక్లిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్యాన్ని నియంత్రించాలని భావించిన చైనా అందుకు ఎన్నో నిబంధనలు తీసుకొస్తోంది.
గతంలోలా సైకిళ్ల వినియోగం భారీగా పెరగాలని కోరుకుంటోంది. పట్టణజీవనం ప్రమాదంలో పడిందని, కాలుష్యంతో ఎన్నో రోగాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్న చైనా సైక్లింగ్ ను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా ఫ్యూజియన్ ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ ను సైకిళ్లు, పాదచారుల కోసం నిర్మించింది. ఈ ఫ్లై ఓవర్ పై కేవలం సైకిళ్లు, పాదచారులు మాత్రమే ప్రవేశించాలని నిబంధన విధించింది. కాగా, ఫ్లై ఓవర్లను మెట్రో రైళ్లు, బస్సుల కోసం నిర్మిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సైకిళ్ల కోసం ఇలాంటి ఫ్లై ఓవర్ నిర్మించడం ఆశ్చర్యకరమే.